తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ని తలవకుండా పూటగడవని సందర్భం ఉంది

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ని తలవకుండా పూటగడవని సందర్భం ఉంది

వైఎస్ విజయమ్మ
హైదరాబాద్:
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తలవకుండా పూట గడవని సందర్భం రెండు రాష్ట్రాల్లో ఉందని ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒకింత భావోద్వాగానికి గురయ్యారు. ప్రతి మలుపు జనజీవనంతో ముడిపడి ఉందని చెప్పేవారని వైఎస్ విజయమ్మ గుర్తు చేసుకున్నారు. అందరితో ఉండాలని, అందరి ప్రేమించాలని చెప్పేవారని, ఆయనకు ప్రజలపై ఆకాశంత ప్రేమ ఉండేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 
వైఎస్ లేకున్నా నా బిడ్డలను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారు
వైఎస్ ఈరోజు భౌతికంగా లేకపోయినా నా బిడ్డలను ప్రజలు, నాయకులు  అమితంగా ప్రేమించి ఆదరించి అక్కున చేర్చుకున్నారని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. నా కుటుంబం ఎప్పుడు మీ అందరికి రుణపడి ఉంటానన్నారు. వైఎస్ ని తలవకుండా పూట గడవని సందర్భం రెండు రాష్ట్రాల్లో ఉందని, ఏ మనిషిని అడిగినా ఆయనుంటే ఇలా ఉండేది కాదు అనే చెప్తారని తెలిపారు. ఏ రాయిని అడిగినా నీ పేరే చెప్తుంది, ఇంత ప్రజల ప్రేమ ఎట్లా సంపాదించవని రాజీవ్ గాంధీ ఆశ్చర్యం వ్యక్తం చేసారని గుర్తు చేశారు. మేము అధికారంలో ఉన్నామంటే అందుకు కారణం వైఎస్ అని స్వయంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని తెలిపారు. ఏ ప్రతిపక్ష నాయకుడు మరణించినా జెండా అవతనం చేయని బీజేపీ వైఎస్ చనిపోయినప్పుడు మాత్రమే అవతనం చేసి గౌరవించమని మోడీ చెప్పారని అన్నారు. ఏ పథకం, ప్రాజెక్టు చుసిన రాజన్న గుర్తుకు వస్తారని విజయమ్మ వివరించారు. 
అధికారం పెరిగినా అహంకారం తలకెక్కని నేత
సీఎంగా అధికారం, బాధ్యతలు పెరిగినా అహంకారం తలకెక్కని ఏకైక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని శాంత బయో టెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. తరగని చిరునవ్వుకు నిదర్శనం వైఎస్, ప్రజలకు మేలు చేసేందుకు ప్రణాళికబద్దంగా అవగాహనతో సమర్థవంతంగా అమలు చేసిన నేత అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వరంగా ప్రజలకు అందించిన ఘనత వైఎస్ కే దక్కుతుందని, వైఎస్ లో వైద్యుడు ఉన్నాడు, మానవతావాది కూడా ఉన్నాడని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థుల పట్ల సానుకూలంగా నిర్ణయాలు తీసుకుని అజాత శత్రువుగా నిలిచారని, నేను కష్టాల్లో ఉన్న సమయంలో స్వయంగా కోర్టులో వాగ్మూలం ఇచ్చిన గొప్ప మనసు వైఎస్ ది అని చెప్పారు. 
రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ సమావేశానికి వైఎస్ తో సన్నిహిత సంబంధాలు కలిగిన  కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరా రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, జర్నలిస్టు యూనియన్ల నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.